యవ్వనంగా కనిపించాలా?.. వీటిని ఆహారంలో చేర్చుకోండి..!

  • చర్మానికి విటమిన్‌-ఏ ఎంతో అవసరం
  • చిలగడదుంప, క్యారెట్‌లో బీటా కెరోటిన్‌ ఎక్కువ
  • ఆకుకూరలు చర్మానికి పోషకాలు అందిస్తాయి
  • గుడ్లు, గుమ్మడికాయ కూడా మంచి ఎంపిక
  • స్కిన్‌కేర్‌తో పాటు పోషకాహారం అవసరం
చర్మంపై ముడతలు తగ్గాలంటే చాలామంది ఖరీదైన రెటినాల్‌ క్రీమ్‌లు, సీరమ్‌ల వైపు చూస్తారు. కానీ వంటింట్లోనే ఉండే కొన్ని ఆహారాలు కూడా చర్మానికి లోపలి నుంచి బలం ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి క్రీమ్‌లకు ప్రత్యామ్నాయం కాకపోయినా, చర్మ కణాల ఆరోగ్యాన్ని కాపాడుతూ యవ్వనంగా కనిపించేందుకు తోడ్పడతాయి.

ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సింది చిలగడదుంప గురించే. ఇందులో బీటా కెరోటిన్‌ పుష్కలంగా ఉంటుంది. శరీరం దీన్ని అవసరమైనప్పుడు విటమిన్‌-ఏగా మార్చుకుంటుంది. దీంతో చర్మ కణాల పునరుద్ధరణకు తోడ్పడుతుంది. ఉడికించి, కాల్చి లేదా చాట్‌లా తీసుకున్నా మంచి ప్రయోజనం ఉంటుంది. క్యారెట్‌లో కూడా ఇది ఎక్కువగా ఉంటుంది. పైగా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాలుష్యం, ఎండ ప్రభావం నుంచి చర్మాన్ని కాపాడతాయి.

పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలను కూడా నిర్లక్ష్యం చేయొద్దని నిపుణులు చెబుతున్నారు. వీటిలో బీటా కెరోటిన్‌తో పాటు విటమిన్‌-సీ, ల్యూటిన్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. అలాగే గుడ్డు పచ్చసొనలో నేరుగా విటమిన్‌-ఏ లభిస్తుంది. దీనితో పాటు ప్రొటీన్‌, బయోటిన్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉండటంతో చర్మం, జుట్టు, గోళ్ల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.

గుమ్మడికాయ కూడా ఈ జాబితాలో కీలకమైన ఆహారమే. ఇందులో బీటా కెరోటిన్‌ అధికంగా ఉంటుంది. కూర, సూప్‌, పులుసు రూపంలో తీసుకోవచ్చు. గుమ్మడికాయ రంగు ఎంత ముదురు నారింజ రంగులో ఉంటే అంత ఎక్కువ పోషకాలు ఉండే అవకాశం ఉంటుంది. క్యారెట్‌ను కొద్దిగా నెయ్యి లేదా వేరుశెనగలతో తింటే బీటా కెరోటిన్‌ను శరీరం మరింత సులభంగా గ్రహిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

అయితే ఈ ఆహారాలు తింటే రెటినాల్‌ క్రీమ్‌ల అవసరం పూర్తిగా తీరిపోతుందని అనుకోవద్దని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఆహారం చర్మానికి లోపలి నుంచి పోషణ అందిస్తే, రెటినాల్‌ ఉన్న క్రీమ్‌లు నేరుగా చర్మంపై పనిచేస్తాయి. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత నీరు, మంచి నిద్ర, సరైన చర్మ సంరక్షణ.. ఇవన్నీ కలిస్తేనే చర్మం ఎక్కువకాలం ఆరోగ్యంగా, యవ్వనంగా కనిపిస్తుంది.

Anti Aging Foods
Natural Retinol Sources
Sweet Potato Skin Benefits
Healthy Skin Diet
Beta Carotene Foods
Youthful Skin Tips

More Telugu News